105 మందితో తొలి జాబితా తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. మొత్తం 119 స్థానాలకు గాను 14 స్థానాల్లో అభ్యర్థుల ఖరారును పెండింగ్‌లో ఉంచారు.

105 మందితో తొలి జాబితా
ముఖ్యమంత్రి కేసీఆర్‌, 13 మంది మంత్రులు.. సభాపతి, ఉపసభాపతిలకు మొదటి విడతలోనే టికెట్లు
ఆందోల్‌, చెన్నూరులలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు నిరాకరణ
పెండింగ్‌లో మరో ఐదుగురు తాజా మాజీ శాసనసభ్యుల పేర్లు
శాసనసభ ఎన్నికలకు తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. 105 నియోజకవర్గాలకు ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను గురువారం ప్రకటించారు. మొత్తం 119 స్థానాలకు గాను 14 స్థానాల్లో అభ్యర్థుల ఖరారును పెండింగ్‌లో ఉంచారు. శాసనసభ రద్దయిన గంటలోనే అనూహ్యంగా అధిక శాతం మంది అభ్యర్థుల పేర్లను  ప్రకటించటం సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికలకు సన్నద్ధతలో భాగంగా విపక్షాల కంటే ఆయన ఒక అడుగు ముందుకేసి వాటికి సవాలు విసిరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా 13 మంది మంత్రులు, శాసనసభాపతి మధుసూదనాచారి, ఉపసభాపతి పద్మాదేవేందర్‌రెడ్డిలకు మొదటి విడతలోనే టికెట్లు లభించాయి. తొలి జాబితాలో తాజా మాజీలైన ఇద్దరు ఎమ్మెల్యేలకు టికెట్లను ఇవ్వలేదు. చెన్నూరులో నల్లాల ఓదెలు స్థానంలో ఎంపీ బాల్క సుమన్‌ను, ఆందోల్‌లో బాబూమోహన్‌ స్థానంలో పాత్రికేయుడు చంటి క్రాంతికిరణ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో పాటు మరో అయిదు స్థానాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు కొండా సురేఖ (వరంగల్‌ తూర్పు), బొడిగె శోభ (చొప్పదండి), సి.కనకారెడ్డి (మల్కాజ్‌గిరి), సంజీవరావు (వికారాబాద్‌), ఎం.సుధీర్‌రెడ్డి (మేడ్చల్‌) స్థానాల్లో టికెట్లను ఇవ్వలేదు.
భాజపా ప్రాతినిధ్యం వహిస్తున్న అయిదు స్థానాలకు గాను ఒక్క ఉప్పల్‌లో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తెరాస అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డికి మరోసారి కేసీఆర్‌ టికెట్‌ ఇచ్చారు. భాజపా ఎమ్మెల్యేలు గెలిచిన అంబర్‌పేట, ఖైరతాబాద్‌, ముషీరాబాద్‌, గోషామహల్‌ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి, ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌ గీతారెడ్డి ప్రాతినిధ్యం వహించే హుజూర్‌నగర్‌, కోదాడ, జహీరాబాద్‌ స్థానాలకు తెరాస అభ్యర్థులను ఖరారు చేయలేదు. మజ్లిస్‌ ఎమ్మెల్యేలు అహ్మద్‌ పాషాఖాద్రి, బలాల ప్రాతినిధ్యం వహిస్తున్న  చార్మినార్‌, మలక్‌పేట నియోజకవర్గాల్లోనూ తెరాస అభ్యర్థి పేరు ప్రకటించలేదు.
తొలి జాబితాలో కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌లకు గజ్వేల్‌, సిరిసిల్ల టికెట్లు కేటాయించారు. మంత్రి మహేందర్‌రెడ్డి, ఆయన సోదరుడు నరేందర్‌రెడ్డిలకు తాండూరు, కొడంగల్‌ టికెట్లు లభించాయి. పరిగిలో మాజీ ఉపసభాపతి కొప్పుల హరీశ్వర్‌రెడ్డి కుమారుడు మహేశ్వర్‌రెడ్డికి టికెట్‌ ఇచ్చారు.
అత్యధికం తాజా మాజీ ఎమ్మెల్యేలకే
ప్రస్తుత ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం కల్పిస్తామని పదేపదే ప్రకటించిన కేసీఆర్‌ ఆ మాటకే కట్టుబడి ఉన్నారు. ప్రస్తుతం తెరాసలో మొత్తం 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఏడుగురు మినహా మిగిలిన 83 మందికీ టికెట్లు ఇచ్చారు. సీఎల్పీ నేత జానారెడ్డి ప్రాతినిధ్యం వహించిన నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహించిన మధిర నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి లింగాల కమల్‌రాజ్‌కు టికెట్‌ను ఇచ్చారు.

గత ఎన్నికల్లో ఓడినా వీరికి అవకాశం
గత ఎన్నికల్లో తెరాస తరపున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి (వనపర్తి), పిడమర్తి రవి (సత్తుపల్లి), నోముల నర్సింహయ్య (నాగార్జున సాగర్‌), బేతి సుభాష్‌రెడ్డి (ఉప్పల్‌), పెద్ది సుదర్శన్‌రెడ్డి (నర్సంపేట), సంజయ్‌కుమార్‌ (జగిత్యాల), ఎం.రామ్మోహన్‌గౌడ్‌ (ఎల్బీనగర్‌), సీతారాంరెడ్డి (చంద్రాయణ్‌గుట్ట), కార్వాన్‌ (టి.జీవన్‌సింగ్‌), నాంపల్లి (ఆనంద్‌గౌడ్‌), గద్వాల (కృష్ణమోహన్‌రెడ్డి)లకు మళ్లీ టికెట్లు ఇచ్చారు.

ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు టికెట్లు
గత ఎన్నికల్లో ఇతర పార్టీల తరపున గెలిచి తెరాసలో చేరిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, కోరెం కనకయ్య, పువ్వాడ అజయ్‌కుమార్‌, భానోతు మదన్‌లాల్‌, చల్లా ధర్మారెడ్డి, ఎన్‌, భాస్కర్‌రావు, రవీంద్రకుమార్‌, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, కేవీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, విఠల్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్‌లకు మళ్లీ టికెట్లు లభించాయి. తెదేపా నుంచి తెరాసలో చేరిన నేత కంచర్ల భూపాల్‌రెడ్డికి టికెట్‌ లభించింది.

అయిదు స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థులు!
పెండింగ్‌ ఉంచిన అయిదుగురు తాజా మాజీ ఎమ్మెల్యేల స్థానంలో ప్రత్యామ్నాయ అభ్యర్థులపై తెరాస దృష్టి సారించింది. వరంగల్‌ తూర్పులో మాజీ ఎంపీగుండు సుధారాణి, బస్వరాజ్‌ సారయ్య, మల్కాజ్‌గిరిలో ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, వికారాబాద్‌, మేడ్చల్‌, చొప్పదండిలలో కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిసింది.

వీరికి టికెట్లు నిరాకరణ
నల్లాల ఓదెలు(చెన్నూరు), బాబూమోహన్‌ (ఆందోల్‌)
వీరికి అనుమానమే
కొండా సురేఖ (వరంగల్‌ తూర్పు), 
బొడిగె శోభ (చొప్పదండి), 
సి.కనకారెడ్డి (మల్కాజ్‌గిరి), 
సంజీవరావు (వికారాబాద్‌), 
ఎం.సుధీర్‌రెడ్డి (మేడ్చల్‌) * కొత్తగా అవకాశం
బాల్క సుమన్‌ (చెన్నూరు)
చంటి క్రాంతికిరణ్‌ (ఆందోల్‌)
* ఏ  సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు 
* ఓసీ-55 బీ బీసీ-21
* ఎస్సీ-16, బీ ఎస్టీలు-11
* మైనారిటీలు-2 
* తొలి జాబితాలో మొత్తం మహిళలు- నలుగురు
తెరాస తరఫున తొలిసారి శాసనసభకు పోటీచేస్తున్న అభ్యర్థులు
ఎంపీ బాల్క సుమన్‌ (చెన్నూరు), కంచర్ల భూపాల్‌రెడ్డి (నల్గొండ), చంటి క్రాంతికిరణ్‌ (ఆందోల్‌)లు తొలిసారిగా తెరాస ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దిగనున్నారు. కల్వకుర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు తెరాస అభ్యర్థిగా అవకాశం లభించింది. గతంలో ఖమ్మం లోక్‌సభ నుంచి వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయిన తెల్లం వెంకటరావు (భద్రాచలం), సీపీఎం నుంచి పోటీ చేసి ఓడిపోయిన లింగాల కమల్‌రాజ్‌ (మధిర)లు ఈసారి తెరాస తరఫున పోటీ చేస్తున్నారు.
తాజా మాజీలకు భంగపాటు ఎందుకంటే
నల్లాల ఓదెలు, బాబూమోహన్‌లకు సర్వేలో అతి తక్కువగా ఓట్లు రావడం, స్థానిక నేతలు ఈ ఇద్దరి వ్యవహారశైలిపై పెద్దఎత్తున ఫిర్యాదులు చేయడంతో వారికి తెరాస తొలి జాబితాలో స్థానం లభించలేదని తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న మరో అయిదు తాజా మాజీ ఎమ్మెల్యేలకూ టికెట్లు దక్కటం అనుమానమే. కొండాసురేఖ దంపతులు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారంతో పాటు స్థానిక నేతలు వ్యతిరేకించడం వల్ల టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. బొడిగె శోభపైనా వివిధ రకాల వివాదాలున్నాయి. బుధవారం తెరాస స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వచ్చి  ఫిర్యాదు చేయడంతో ఆమెకు టికెట్‌ రాదని తేలిపోయింది. కనకారెడ్డి, సంజీవరావు, సుధీర్‌రెడ్డిలకు కూడా సర్వేలో ప్రజాదరణ లేదని తేలడంతో వారికి టికెట్లు ఇవ్వడానికి సీఎం కేసీఆర్‌ విముఖంగా ఉన్నారు.
* హుజూర్‌నగర్‌, కోదాడ, జహీరాబాద్‌ల్లోని విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన చోట బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు. మజ్లిస్‌ పార్టీ ప్రాతినిధ్యం వహించిన చార్మినార్‌, మలక్‌పేటల్లో బలహీనమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు.
* భాజపా ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు చోట్ల తెరాస అభ్యర్థుల ఖరారుపై ఏకాభిప్రాయం రావాల్సి ఉంది. ఖైరతాబాద్‌లో పార్టీ ఇన్‌ఛార్జి మన్నె గోవర్దన్‌రెడ్డి ముందంజలో ఉన్నా.. పీజేఆర్‌ కుమార్తె విజయారెడ్డి ఈ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. దానం నాగేందర్‌ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తుండడంతో ఎంపిక క్లిష్టంగా మారింది.
* గోషామహల్‌లో తెరాస నేత నందకిషోర్‌వ్యాస్‌ బిలాల్‌ సర్వేలో మొదటి స్థానంలో ఉన్నా... ఇక్కడి నుంచి దానం నాగేందర్‌ను పోటీ చేయించాలన్న ప్రతిపాదన రావడంతో అభ్యర్థిని ఖరారు చేయలేదు.
* అంబర్‌పేటలో సుధాకర్‌రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసినా ఇప్పుడు మరో అభ్యర్థి కోసం అధిష్ఠానం యోచిస్తోంది.
* ముషీరాబాద్‌లో పార్టీ నేత ముఠాగోపాల్‌, హోంమంత్రి నాయిని అల్లుడు శ్రీనివాస్‌రెడ్డిల మధ్య పోటీ ఏర్పడింది.
* పలువురు తాజా మాజీలపై విమర్శలు వచ్చినా, వివాదాల్లో చిక్కుకున్నా సీఎం కేసీఆర్‌ సర్వేల ప్రాతిపదికన వారి బలాలను పరిగణనలోనికి తీసుకొని మళ్లీ టికెట్లు ఇచ్చారు.

Comments

Popular posts from this blog

Ekkees Tareekh Shubh Muhurat - full movie | Sanjay Mishra & Chandr...

చెన్నూర్ నుంచి బాల్క.. ఆందోళ్ నుంచి జర్నలిస్ట్ క్రాంతి

తెలంగాణ ప్రభుత్వాన్ని రద్దు . ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించాలని కేసీఆర్‌ telangana cm kcr